

రాహుల్ గాంధీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి, ఇమేజ్ కేటీఆర్‌కు లేదని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి, ఖమ్మంలో రైతులకు బేడీలు వేయడం, మల్లన్నసాగర్ ప్రాజెక్టు బాధితులపై లాఠీచార్జి వంటి ఘటనలపై కేటీఆర్‌ను ప్రశ్నించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా అని పొన్నం ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా పరీక్షను కూడా నిర్వహించిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సామర్థ్యం తమ ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నేతలు వేల కోట్ల రూపాయల ఆస్తుల సంపాదనపై ఆసక్తి చూపించారని ఆరోపిస్తూ, ఫార్ములా ఈ రేస్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, అసైన్డ్ భూముల వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలను ప్రస్తావించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్భాటాలకు, ప్రస్తుత ప్రజా ప్రభుత్వ ఏర్పాట్లకు మధ్య తేడా ఉందని వ్యాఖ్యానించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!