

ఢిల్లీలో నవంబర్ 20 నుంచి 22 వరకు జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశంలో పాల్గొనేందుకు పాకిస్థాన్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌కు రావడం రాజకీయ వివాదానికి దారితీసింది. ఆయన పర్యటనపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన సమయంలో ముసాదిక్ మాలిక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను విపక్షాలు గుర్తుచేస్తున్నాయి. అప్పట్లో ‘మా నీళ్లను ముట్టుకుంటే చేతులు నరికేస్తాం’ అంటూ ఆయన హెచ్చరించినట్లు పేర్కొంటున్నాయి. అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇప్పుడు భారత్‌కు రావడంపై సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఫక్రుల్ హసన్ స్పందిస్తూ.. బీజేపీ విదేశాంగ విధానం గందరగోళంగా ఉందని విమర్శించారు.
మరోవైపు, ముసాదిక్ మాలిక్ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెబుతున్న బీజేపీ.. ఒకవైపు భారత క్రికెటర్లు పాకిస్థాన్‌తో ఆడకూడదని కోరుతూ, మరోవైపు ఆ దేశ మంత్రులకు స్వాగతం పలుకుతోందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కేంద్ర విదేశాంగ విధానం అయోమయంగా ఉందని, ప్రధాని మోదీ ఒత్తిడిలో పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారని ఇండియా కూటమి నాయకుడు సురేంద్ర రాజ్‌పూత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ సైతం ముసాదిక్ మాలిక్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఉగ్రవాదుల హెచ్చరికలకు ఏమాత్రం తీసిపోవని మండిపడ్డారు. ఈ ఎస్‌సీఓ సమావేశంలో భారత్, పాకిస్థాన్‌తో పాటు చైనా, రష్యా, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, బెలారస్ దేశాలు పాల్గొననున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!