

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ ప్రమాణస్వీకారం సోమవారం జరగనుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో 1,205 ఏకగ్రీవ ఎన్నికలతో పాటు 11,497 పోలింగ్ ద్వారా మొత్తం 12,702 మంది సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల విషయానికి వస్తే 25,848 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 85,955 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,11,803 మంది వార్డు సభ్యులుగా గెలుపొందారు. వార్డు సభ్యుల ఎన్నికల అనంతరం 12,702 మంది ఉప సర్పంచులను ఎంపిక చేశారు.
ఈ నెల 22న అందరి ప్రమాణస్వీకారానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. Telangana State Election Commission నిర్దేశించిన నమూనా ప్రకారమే ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం కొత్త సర్పంచులకు ప్రత్యేకాధికారులు అధికారికంగా బాధ్యతలను అప్పగిస్తారు.
సర్పంచులు, ఉప సర్పంచుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి పెద్ద గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.20 వేలు, చిన్న పంచాయతీల్లో రూ.10 వేలు ఖర్చవుతుందని కార్యదర్శులు అంచనా వేస్తున్నారు. బ్యానర్లు, టెంట్లు, మైక్ సెట్లు, కుర్చీలు, శాలువాలు, కొత్త రిజిస్టర్లు, అలాగే హాజరయ్యే వారికి మిఠాయిలు, తినుబండారాలు, తేనీరు వంటి ఖర్చులు సంప్రదాయంగా కొనసాగుతున్నాయి.
అయితే చాలా గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత తీవ్రంగా ఉంది. ఇటీవల పోలింగ్ సమయంలో సిబ్బంది భోజనాలు తదితర ఖర్చులను కొన్నిచోట్ల కార్యదర్శులు, ఎంపీడీవోలు భరించగా, ఆ బిల్లులు ఇంకా ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. గత మూడు నెలలుగా వేతనాలు కూడా రాకపోవడంతో కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో, కొన్ని గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులే ముందుకొచ్చి ప్రమాణస్వీకార కార్యక్రమానికి అయ్యే ఖర్చులను భరించేందుకు సిద్ధమవుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!