

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 18న జరగనున్న అవిశ్వాస తీర్మాన సమావేశానికి నాలుగు రోజుల ముందే ఆమె రాజీనామా ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం రాత్రి మేయర్ ఛాంబర్లో మీడియాతో మాట్లాడిన స్రవంతి, ఆదివారం కలెక్టర్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేస్తానని తెలిపారు.
నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉండగా, వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మిగిలినవారిలో 42 మంది ఇటీవల సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనపై అవిశ్వాస తీర్మానం తీసుకురావడాన్ని నిరసిస్తూ రాజీనామా చేస్తున్నట్లు స్రవంతి వెల్లడించారు. మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై స్రవంతి తీవ్ర విమర్శలు చేశారు. తనకు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని, కేసులతో భయపెడుతున్నారని ఆరోపించారు. మహిళా కార్పొరేటర్లను కూడా ఇబ్బంది పెట్టారని అన్నారు. మేయర్ పదవిని ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గిరిజన నాయకులకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. మేయర్ రాజీనామా కలెక్టర్ ఆమోదం పొందితే అవిశ్వాస తీర్మానం అవసరం లేకుండా పోనుంది. ఈసీ అనుమతితో కొత్త మేయర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!