

విశాఖపట్నంలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం పనులను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రారంభించారు. రుషికొండ ఐటి పార్క్‌లోని హిల్–2 లో మహతి ఫిన్‌టెక్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని సుమారు వెయ్యి సీటింగ్ సామర్థ్యంతో రూపొందించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఇక సంస్థకు శాశ్వత క్యాంపస్ నిర్మాణం కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో మొత్తం 21.31 ఎకరాలను కాగ్నిజెంట్‌కు కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ భూమి పై అంతర్జాతీయ ప్రమాణాలతో ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపస్‌ను మూడు దశల్లో నిర్మించేందుకు సంస్థ సుమారు రూ.1,583 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది.
పూర్తి ప్రాజెక్ట్ పూర్తయ్యే సరికి సుమారు 8,000 మందికి ఉద్యోగావకాశాలు నెలకొనే అవకాశం ఉంది. ఇందులో భాగంగా 2029 నాటికి పూర్తయ్యే మొదటి దశలోనే దాదాపు 3,000 మందికి ఉపాధి లభిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. మొత్తం మూడు దశలను 2033 నాటికి పూర్తిచేయాలని కాగ్నిజెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!