

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. వార్డులతో పాటు చైర్పర్సన్, మేయర్ పదవులకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను నిర్ణయించింది. మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి జారీ చేసిన జీవో నంబర్ 14 ప్రకారం, బీసీలకు 38 చైర్పర్సన్ పదవులు, 3 మేయర్ పదవులు కలిపి మొత్తం 34 శాతం స్థానాలను కేటాయించారు. అన్ని వర్గాల్లో మహిళలకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేసినట్లు స్పష్టం చేశారు.
2011 జనాభా లెక్కలు, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు, జనాభా నిష్పత్తి ఆధారంగా ఈ రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 లోని సెక్షన్ 7, 28, 29 ప్రకారం ఈ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ జీవోను ఆధారంగా తీసుకుని ఎన్నికల నిర్వహణ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. రిజర్వేషన్లు పూర్తికావడంతో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!