

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన సభకు హాజరుకాని పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవద్దని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం మంత్రి శ్రీధర్‌బాబుకు లేఖ రాశారు. ఈ లేఖను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. జిల్లా ఎమ్మెల్యేలతో ఎంపీకి విభేదాలు ఉన్న నేపథ్యంలో, ఆయన ఈ లేఖను వ్యంగ్యంగా విడుదల చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ లేఖపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన చర్చ జరుగుతోంది.
మంత్రి శ్రీధర్‌బాబుకు రాసిన లేఖలో వంశీకృష్ణ మంథనిలో జరిగిన గణపతి సచ్చిదానంద స్వామీజీ కార్యక్రమంలో మీరు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్‌సింగ్ పాల్గొన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. వ్యక్తిగత విశ్వాసాలు, మతపరమైన కార్యక్రమాలను తాను గౌరవిస్తానని తెలిపారు. అయితే, విశాఖ ట్రస్టు కార్యక్రమానికి హాజరైనందుకు ఓ గిరిజన మహిళా ప్రజాప్రతినిధితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం విచారకరమని అన్నారు. సొంత పార్టీ ఎంపీతో కలిసి పేద విద్యార్థులకు పాఠశాల సంచులు పంపిణీ చేయడమే క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తే, దిల్లీ సభకు గైర్హాజరు కావడం మరింత తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని వ్యంగ్యంగా పేర్కొన్నారు. సహజ న్యాయసూత్రాలను పాటిస్తూ మక్కాన్‌సింగ్, విజయ రమణారావులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దని, వారిని సస్పెన్షన్ నుంచి మినహాయించాలని కోరారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!