

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై తెలంగాణ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రజల ఓటు హక్కుతో చెలగాటమాడే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో అర్హులైన పౌరుల పేర్లను తొలగిస్తే అది వారి హక్కులను హరించడమేనని అన్నారు. ఎస్ఐఆర్ అమలుపై వస్తున్న ఆరోపణలకు సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని, ఓటరు జాబితా నుంచి తొలగించిన ప్రతి పేరుకు గల కారణాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. పేరు తొలగింపుపై అభ్యంతరం తెలిపేందుకు ఓటర్లకు అవకాశం కల్పించాలని, పొరపాటున తొలగించిన అర్హుల పేర్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
వ్యవస్థలో జరిగిన తప్పుల భారాన్ని పౌరులపై మోపడం అన్యాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి అర్హ పౌరుడి ఓటును కాపాడటం రాజ్యాంగబద్ధ బాధ్యత అని, ఎన్నికల ప్రక్రియపై తలెత్తే సందేహాలను ఆధారాలతో, పారదర్శకంగా నివృత్తి చేయాలని సూచించారు. ఓటు హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ అంశంపై ఇండియా కూటమిని సమీకరించడంలో రాహుల్ కీలక పాత్ర పోషించారని అన్నారు. ఓటరు జాబితాల సవరణపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని, అర్హుల ఓట్లు అన్యాయంగా తొలగిస్తే వాటిని పునరుద్ధరించే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!