

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తానే నిర్మించినట్లు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న మాటలు అబద్ధాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల ముందు కొబ్బరికాయ కొట్టడం తప్ప ఈ ప్రాజెక్టుకు జగన్ చేసింది ఏమీలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కృషితో ముందుకు వచ్చిన ప్రాజెక్టుకు ఇప్పుడు క్రెడిట్ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన ప్రణాళికలు, భూసేకరణ చంద్రబాబు హయాంలో పూర్తయ్యాయని, అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు కేసులు, వివాదాలతో ప్రాజెక్టును మూలన పెట్టారని ఎంపీ గుర్తు చేశారు. ఒకప్పుడు ఈ ఎయిర్పోర్టు అవసరమా అని ప్రశ్నించిన జగన్, ఇప్పుడు అదే తన గొప్పతనంగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. నాటి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కేంద్ర అనుమతులు సాధించారని, మాన్సాస్ ట్రస్ట్ ద్వారా 120 ఎకరాల విలువైన భూమి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ కోసం దానంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఇతరుల క్రెడిట్ దోచుకోవడం మానేసి, ఉత్తరాంధ్ర ప్రజలకు చేసిన అన్యాయానికి జగన్ క్షమాపణ చెప్పాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!