

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయబోతుందని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశముందని వారు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం వ్యూహాత్మకంగా తెలంగాణలో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. అస్సాం, బెంగాల్లో సాధించిన విజయాలను తెలంగాణలో కూడా కొనసాగించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం సికింద్రాబాద్, పరేడ్ మైదానంలో జరిగే భారీ సభలో ప్రధాని పాల్గొననున్నారు. రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జహీరాబాద్ సమగ్ర పారిశ్రామిక స్మార్ట్ నగరం, జాతీయ రహదారి విస్తరణ పనులు, భారీ వస్త్ర పార్కు, పచ్చ ఇంధన నిల్వ కేంద్రం వంటి పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుడనున్నారు. కాజీపేట–విజయవాడ బహుళ రైల్వే మార్గ ప్రాజెక్టును కూడా జాతికి అంకితం చేయనున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.
ప్రధాని సభను విజయవంతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. నగరమంతా గోడల రాతలు, పోస్టర్లు, భారీ ప్రకటన ఫలకాలతో నింపేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిమందిని సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ తదితర నేతలు సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను సమీకరిస్తున్నారు. సభకు రెండు లక్షల మందికి పైగా హాజరవుతారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. భద్రత కోసం రెండు వేల మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!