
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం సన్నిహితంగా గమనిస్తోందని, భారతీయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తమిళనాడులోని తిరుచ్చిలో బుధవారం రాత్రి నిర్వహించిన ఎన్డీయే కూటమి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఏ పరిస్థితి ఎదురైనా ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. 2021లో తమిళనాడు ప్రజలు డీఎంకేకు అధికారాన్ని అప్పగించారని, అయితే ఆ బాధ్యతను నిర్వర్తించకుండా ప్రజల కంటే తమ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రధాని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకున్నారని విమర్శించారు.
ఇక తిరుచ్చిలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని రూ.5,655 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్‌కోయిల్–చర్లపల్లి, పోదనూర్ (కోయంబత్తూర్)–ధన్‌బాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. అలాగే రామేశ్వరం–మంగళూరు, తిరునెల్వేలి–మంగళూరు, మయిలాడుదురై–తిరువారూర్–కారైకుడి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ఎల్ మురుగన్, తమిళనాడు మంత్రి తంగం తెన్నరసు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తదితరులు పాల్గొన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!