

ఎన్. చంద్రబాబు నాయుడు ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షిస్తూ, ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను మరింత అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆన్లైన్ ఫిర్యాదులు, వాయిస్ సందేశాల ద్వారా ఫిర్యాదులు స్వీకరించే విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని సుమారు మూడు వేల ప్రాంతాల్లో ఉన్న కనెక్టివిటీ సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించేందుకు నెట్‌వర్క్ సంస్థలతో చర్చించాలని ఆదేశించారు. ‘‘నవచేతన’’ కార్యక్రమం ద్వారా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చేపట్టిన ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ స్క్రీనింగ్ ప్రక్రియను అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 33,949 మంది పిల్లలను స్క్రీన్ చేయగా, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా 11 ప్రభుత్వ సేవలను సులభతరం చేసే చర్యలు ప్రారంభించామని చెప్పారు.
అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలపై కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. నెలలో సెక్రటరీలు మూడు రోజులు, విభాగాధిపతులు ఆరు రోజులు, కలెక్టర్లు ఎనిమిది రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయించారు. సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. సీఐఐ గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధులకు సూచించారు. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించగా, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆర్టీజీఎస్ పనితీరును, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నిర్వహణ విధానాన్ని వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!