

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలో నుంచి తొలగించడంలో అమెరికా పాత్ర ఉందని ఆరోపించే రహస్య దౌత్య సమాచారం తాజాగా లీక్ అయింది. ఈ అసలు పత్రాన్ని ఇన్వెస్టిగేటివ్ పత్రిక ‘డ్రాప్ సైట్’ ప్రచురించింది. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ముందు, అమెరికాలోని పాకిస్థాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్‌తో అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ సమావేశమయ్యారని అందులో పేర్కొన్నారు. ఆ సమావేశంలో ఇమ్రాన్‌ను పదవి నుంచి తొలగించి జైలుకు పంపితే అమెరికా-పాక్ సంబంధాలు మెరుగుపడతాయని చర్చించినట్లు సమాచారం.
ఇమ్రాన్ ఖాన్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ఇమ్రాన్ ఖాన్ తటస్థ వైఖరే అమెరికా అసంతృప్తికి కారణమైందని లీకైన సమాచారం సూచిస్తోంది. ఈ సమావేశానికి ముందు ఇమ్రాన్ ఖాన్ భారీ ర్యాలీ నిర్వహించి తనను తొలగించేందుకు అమెరికా స్థానిక రాజకీయ పార్టీలతో కలిసి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను అమెరికా, పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించాయి. అనంతరం తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు జైలు శిక్ష విధించగా, అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!