

తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భర్తీపై మళ్లీ కదలిక మొదలైంది. ఈ నియామకాల ప్రక్రియను డిసెంబరులో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సందీప్ కుమార్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గురువారం రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి ముందు ప్రజాభవన్ అతిథి గృహంలో సందీప్ కుమార్‌తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ యంత్రాంగం చురుగ్గా పనిచేయాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీలు, కార్యదర్శుల నియామకాల అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
ర్యాలీ అనంతరం సందీప్ కుమార్ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో సుమారు గంటసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలోనూ నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భర్తీపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. డిసెంబరు 15 తర్వాత సందీప్ కుమార్ జిల్లాల పర్యటన చేపట్టి, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం కానున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేయడం ఈ పర్యటనల లక్ష్యంగా చెబుతున్నారు. గతంలో దసరా నాటికి కార్పొరేషన్ పదవుల భర్తీ చేపడతామని మహేశ్ కుమార్ గౌడ్ సంకేతాలిచ్చినా, ఆ ప్రక్రియ వాయిదా పడింది. పార్టీకి విధేయులైన కార్యకర్తలు, డీసీసీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన గతంలో ప్రకటించడంతో, డిసెంబరులోనైనా నియామకాలు పూర్తవుతాయని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!