

తమిళనాడు రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కే. కామరాజ్ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్ రాష్ట్రంలోని బ్రేక్‌ఫాస్ట్ పథకానికి కామరాజ్ పేరు పెట్టడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. 2022లో డీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన ‘చీఫ్ మినిస్టర్స్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’ను జూలైలో ‘పెరుంతలైవర్ కామరాజర్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్’గా పేరు మార్చారు. సెప్టెంబర్ 22న ఈ పథకాన్ని 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు విస్తరించడంతో మరో 15.30 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా 15,454 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు చేరింది. ఇందుకోసం అదనంగా రూ.217.63 కోట్లు కేటాయించారు.
పథకం పేరు మార్పుపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమానికి పేరు మార్చి కొత్త ప్రభుత్వం రాజకీయ క్రెడిట్ పొందే ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీ విమర్శిస్తోంది. మరోవైపు విజయ్ ప్రభుత్వం విద్య, విద్యార్థుల సంక్షేమంతో కామరాజ్ వారసత్వాన్ని అనుసంధానిస్తూ పథకాన్ని విస్తరిస్తోంది. తమిళనాడులో విద్యా రంగం అభివృద్ధి, పాఠశాలల విస్తరణ, విద్యార్థుల సంక్షేమంతో కామరాజ్ పేరు బలంగా ముడిపడి ఉండటంతో ఈ నిర్ణయానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
కామరాజ్ పేరు చుట్టూ మొదలైన చర్చ ఇప్పుడు కేవలం పథకం పేరు మార్పుకే పరిమితం కాకుండా రాజకీయ గుర్తింపుల అంశంగా మారుతోంది. డీఎంకే తన సంక్షేమ పథకాలకు ఉన్న రాజకీయ గుర్తింపును కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా.. విజయ్ అదే సంక్షేమ విధానానికి తనదైన గుర్తింపును జోడించే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కామరాజ్ వారసత్వాన్ని విద్య, అభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రతీకగా ప్రస్తావించే అవకాశం ఇతర పార్టీలకు కూడా ఉంది. ఈ పరిణామం భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలపై ఎంత ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!