

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2029 ఎన్నికలకు రెండేళ్ల ముందే, అంటే 2027లో ఈ పాదయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రారంభమైన "ప్రజా సంకల్ప యాత్ర"కి నేటితో ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఆ యాత్రలో జగన్ మొత్తం 3,648 కిలోమీటర్ల దూరం నడుస్తూ 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాలను సందర్శించారు. ఆ యాత్రే 2019లో ఆయనను అధికారంలోకి తెచ్చిన ప్రధాన కారణంగా వైసీపీ శ్రేణులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడేమో పార్టీ పరాజయంతో కుంగిపోయిన కార్యకర్తలకు మళ్లీ ఉత్సాహం నింపే ప్రయత్నంగా ఈ పాదయాత్రను వైసీపీ చూస్తోంది. ఎన్నికల తర్వాత జగన్ ప్రజల్లో పెద్దగా కనిపించకపోవడంతో పార్టీ అంతర్గతంగా అసంతృప్తి చెలరేగినట్లు సమాచారం. తుఫానులు , వరదలు, రైతు సమస్యల సమయంలో జగన్ తక్కువగా ప్రజల్లోకి వచ్చినందుకు ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది.
ఇక తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించిన వివరాల ప్రకారం, 2027లో ప్రజా సంకల్ప యాత్ర-2 పేరుతో జగన్ మరో భారీ పాదయాత్ర చేపట్టబోతున్నారని తెలుస్తోంది. జిల్లాల పర్యటనలు ప్రారంభించి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని ఆయన ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్ర పార్టీకి కొత్త ఊపును తీసుకువస్తుందా, లేక మరలా ప్రజా విశ్వాసం సంపాదించగలదా అన్నది రాబోయే కాలమే చెప్పాలి.










కామెంట్స్ (2)
Hope it brings positive change.
నాయకుడు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి, యాత్ర ఒక్కటే కాదు కదా