

అమరావతి: అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతిని సర్వనాశనం చేయడమే లక్ష్యంగా కుట్రలు చేసిన వైకాపా అధ్యక్షుడు జగన్ ఇప్పటికీ రాజధానిపై విషం కక్కడం మానలేదు. అవాకులు, చవాకులతో మరోసారి రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. గురువారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై జగన్ విద్వేషం వెళ్లగక్కారు.
చంద్రబాబు నాయుడు రివర్ బేసిన్లో “సో-కాల్డ్” రాజధాని కట్టాలనుకుంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. కానీ చరిత్రలో గొప్ప నగరాలు నదీ తీరాల వెంబడే విలసిల్లాయి. లండన్ (థేమ్స్ నది), న్యూయార్క్ (హడ్సన్), కైరో (నైలు) బాగ్దాద్ (టైగ్రిస్), మాస్కో (మొస్కావా), బెర్లిన్ (స్ప్రీ), షాంగై (హువాంగ్పు) రోమ్ (టైబర్)... ఇలా అనేక మహానగరాలు నదీ తీరాల్లోనే అభివృద్ధి చెందాయి. మన దేశ రాజధాని దిల్లీ యయునా నది ఒడ్డున ఉంది. కోల్‌కతా, లక్నో, వారణాసి, కాన్పుర్, పాట్నా, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, మథుర, నాసిక్, కటక్ లాంటి నగరాలన్నీ నది ఒడ్డునే ఉన్నాయి. తాగునీరు, వ్యవసాయం, రవాణా వంటివాటికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో నదీతీరంలో మహానగరాల నిర్మాణం జరిగింది. కృష్ణా నదికి ఒక ఒడ్డున విజయవాడ ఉన్నప్పుడు, మరో ఒడ్డున అమరావతిని నిర్మిస్తే జగన్‌కు వచ్చిన ఇబ్బందేంటి? రాజధాని నిర్మాణానికి ఎన్జీటీ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
హైకోర్టు అమరావతినే ఏకైక రాజధాని గా నిర్మించాలని స్పష్టంగా చెప్పినప్పటికీ, జగన్ వైఖరి మారలేదు. ఈ విమర్శల ద్వారా వైకాపా నిజమైన ఉద్దేశాలు, అమరావతిపై వారి వైఖరేంటో మరోసారి స్పష్టం చేసిందని ప్రత్యర్థి నాయకులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!