

భారత్ నేడు ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక రంగాల్లో వేగంగా ఎదుగుతున్న శక్తిగా నిలుస్తూ, దక్షిణాసియాలో తన ప్రాభవాన్ని మరింత బలపరుచుకుంటోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాల వల్ల వాణిజ్య రంగంలో భారత్ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. రష్యా చమురు దిగుమతులపై 25 శాతం జరిమానాతో కలిపి మొత్తం 50 శాతం సుంకాలు విధించడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇదే సమయంలో అమెరికా పాకిస్థాన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం భారత్‌కు అసహనాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా లేదా రష్యాపై పూర్తిగా ఆధారపడకుండా బహుళ దేశాలతో సంబంధాలను విస్తరించుకోవాలనే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలోనే జర్మనీతో భారత్ వ్యూహాత్మకంగా దగ్గరవుతోంది. ట్రంప్ విధానాల వల్ల అమెరికా పట్ల అనుమానాలు పెరుగుతున్న వేళ, జర్మనీ కూడా ప్రత్యామ్నాయ భాగస్వామ్యాలను అన్వేషిస్తోంది. ఫ్రీడ్రిక్ పర్యటన సందర్భంగా రక్షణ, సైనిక విన్యాసాలు, నౌకా రేవుల వినియోగం, భద్రతా విధానాలపై సంప్రదింపులు వంటి కీలక ఒప్పందాలు కుదిరాయి. రక్షణ సాంకేతికత, అరుదైన లోహాలు, సెమీకండక్టర్లు, హరిత ఇంధనం, పరిశోధనాభివృద్ధి రంగాల్లో సహకారం పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, ఉపాధి అవకాశాలతో పాటు భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి జర్మనీ మద్దతు ఇవ్వడం ఈ భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!