

రాష్ట్ర నదీజలాల అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలోనే భారీ స్థాయిలో జల దోపిడి జరిగిందని ఆయన విమర్శించారు. మూడు జిల్లాలకు నష్టం కలిగించిన బాధ్యత కేసీఆర్‌దేనని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల నుంచి నీటిని తీసుంటే రాష్ట్ర హక్కులు నిలబెట్టుకునే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. 2026 జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటిస్తూ, నదీజలాల నిజాలపై సభలోనే చర్చిద్దామన్నారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టారని కేసీఆర్‌పై మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్ సరిగా సమర్పించలేదని, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకున్నదే కేసీఆర్ అని గుర్తు చేశారు. గోదావరి జలాల్లో 71 శాతం వాటా కోసం తాము పోరాడుతున్నామని చెప్పారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ఏకపాత్రాభినయం చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కేసీఆర్‌ను “ఆర్థిక ఉగ్రవాది”గా అభివర్ణించిన సీఎం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆయన కుప్పకూల్చారని ఆరోపించారు. నాలుగు మార్గాల్లో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని, వాటిని తాము సరిచేస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై విచారణకు డీఓపీటీ నుంచి అనుమతి ఎందుకు రావడం లేదని సందేహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి రావాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. కేసీఆర్ వెళ్లిపోవాలని కోరుకుంటున్నది కేటీఆర్, హరీష్ రావులేనని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తరువాత తనదారి తనదేనని హరీష్ రావు చెప్పకనే చెప్పాడని, బీఆర్ఎస్లో పార్టీ పగ్గాలపై చర్చ మొదలైందన్నారు. చివరగా, కేసీఆర్ చావును తాను ఎందుకు కోరుకుంటానని ప్రశ్నిస్తూ, ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు వెళ్లి పరామర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!