

ఢిల్లీ లో జరిగిన అమెరికా–భారత వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడిదారుల కోసం అత్యుత్తమ గమ్యస్థానంగా మారుతోందని చెప్పారు. నగరంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రత వంటి అంశాలు పెట్టుబడులకు పెద్ద ప్లస్ అని అన్నారు. తెలంగాణ దేశంలోనే వేగంగా ఎదుగుతున్న రాష్ట్రమని, యువశక్తి ఎక్కువగా ఉండటం అభివృద్ధికి మరో బలం అని ఆయన తెలిపారు. గత 23 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి–సంక్షేమ చర్యలను వివరించారు. 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం జరుగుతోందని చెప్పారు.
మూసీ నది పునరుజ్జీవనంతో హైదరాబాద్ లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్ఫ్రంట్ల మాదిరిగానే నైట్ ఎకానమీ కొత్త దశలోకి వెళ్లబోతుందని పేర్కొన్నారు.
డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ORR–RRR మధ్య మాన్యుఫాక్చరింగ్ జోన్ వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిని సీఎం వివరించారు. ‘చైనా ప్లస్ వన్’ మోడల్‌కు తెలంగాణ ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అన్నారు. అదేవిధంగా, ముఖ్యమైన రోడ్లకు కంపెనీల పేర్లు పెట్టే ఆలోచనను కూడా రేవంత్ రెడ్డి వెల్లడించారు. గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల పేర్లను రోడ్లకు ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు హైదరాబాద్‌లో స్థాపించేందుకు ఆహ్వానం పలికారు. సులభ వీసా విధానాలు అమల్లో ఉంటే గ్లోబల్ సౌత్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
సదస్సులో ఆయన ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌ను ప్రదర్శించగా, అంతర్జాతీయ వ్యాపార వర్గాలు మంచి స్పందన ఇచ్చాయి. టెక్ దిగ్గజాలు ఈ విజన్‌ను ధైర్యవంతమైనదిగా, అమలు చేయగలదిగా అభివర్ణించాయి. డిసెంబరు 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు పలువురు విదేశీ ప్రతినిధులు హాజరవుతామని తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!