

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పుణ్యమాని.. తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకించి కృష్ణా జిల్లా అంతర్గత రాజకీయాల్లో పెనుతుపానే పుట్టింది. చంద్రబాబు అండ్ కో నెత్తిన పెట్టుకుంటూ ఎంపీగా పార్లమెంటుకు పంపిన కేశినేని చిన్ని ఎన్నెన్ని రకాల ఆర్థిక అక్రమాలకు మోసాలకు పాల్పడ్డడో కొలికపూడి శ్రీనివాసరావు.. చాలా స్పష్టంగా పూసగుచ్చినట్టుగా మీడియా ముందు పలుసందర్భాల్లో వివరించి చెప్పారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు పార్టీ పరువును బజార్లో పెట్టాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులతోనూ పార్టీ హైకమాండ్ చ్చలు జరిపి వివాదం పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే.. పార్టీ హైకమాండ్ చేసిన పంచాయతీ మరీ చిల్లర పంచాయతీలా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఏమాత్రం న్యాయసమ్మతంగా లేనేలేదని.. ప్రజలు అనుకుంటున్నారు.
కొలికపూడి- కేశినేని మధ్య రచ్చ కొంతకాలంగా ముదిరి పాకాన పడింది. చంద్రబాబునాయుడు విదేశీ యాత్రల్లో ఉండగా.. వీరు రచ్చకెక్కడంతో ఇద్దరిలో ఎవ్వరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదని.. ఇగ్నోర్ చేయాలని పార్టీ నాయకులకు సూచిస్తూ.. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే చంద్రబాబు ఆదేశాలు బేఖాతరు అయ్యాయనేందుకు నిదర్శనంగా.. మంగళవారం నాడు ఇద్దరు నాయకులను హైకమాండ్ క్రమశిక్షణ కమిటీ పంచాయతీకి పిలిచింది. అయితే.. ఈ పంచాయితీ తీరే సక్రమంగా లేదని పార్టీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. ఎందుకంటే.. ప్రధానంగా ఇద్దరి మధ్య వివాదాన్ని పరిష్కరించాలనే ఉద్దేశం హైకమాండ్ కు ఉంటే గనుక.. ఇద్దరితో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నప్పటికీ కూడా.. ఆ తర్వాతనైనా ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి సమస్యను కొలిక్కి తెచ్చేయాలి. గతంలో చంద్రబాబు కొందరి విషయంలో ఇలాగే చేశారు. కానీ.. తిరువూరు పంచాయతీలో.. కొలికపూడి శ్రీనివాసరావును ఉదయం పదిగంటలకు రమ్మని పిలిచి… దాదాపు నాలుగు గంటలపాటూ క్రమశిక్షణ కమిటీ వారు మాట్లాడారు.
కేశినేని చిన్ని మాత్రం సాయంత్రం వచ్చి కేవలం 20 నిమిషాల్లో తిరిగివెళ్లిపోయారు. పనిలో పనిగా చంద్రబాబు తనకు దేవుడు, పార్టీనే దైవం లాంటి మాటలు కూడా చెప్పారు. ఈ ఇద్దరితో విడిగా మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందా? అనేది ప్రధాన సమస్య. పార్టీకి కట్టుబడి ఉంటానని కొలికపూడి అన్నారు గానీ.. చిన్ని స్థాయిలో భజన డైలాగులు వేయలేదు. పైగా ఇప్పుడు పార్టీ హైకమాండ్.. కేశినేని చిన్నికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే గనుక.. ఆయన భజనకు పడిపోయినట్టుగా అనుకోవాల్సి ఉంటుంది. అలాంటి అవకాశం విమర్శకులకు ఇవ్వకుండా.. ఇద్దరు నాయకుల్ని ఒకే చోట కూర్చోబెట్టి పంచాయతీ ని తేల్చేసి ఉంటే పోయేదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!