

ఆలయాలలో భక్తులు అర్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు చేయించుకుంటే లేదా కుటుంబ సభ్యులకు ప్రసాదం కొనుగోలు చేసి తీసుకెళ్తే ఆ సేవలపై కూడా జీఎస్టీ చెల్లించాల్సిందేనని కేంద్ర పన్ను అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అనేక ప్రముఖ దేవాలయాలకు వరుసగా జీఎస్టీ నోటీసులు రావడంతో దేవాదాయ శాఖ తీవ్ర అసౌకర్యానికి లోనవుతోంది.
యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, కొమరవెల్లి మల్లన్న, బాసర సరస్వతి ఆలయాలు సహా అనేక చిన్న ఆలయాలు కూడా ఈ నోటీసుల పరిధిలోకి వచ్చాయి. అర్చన, అభిషేకం, ఇతర ఆర్జిత సేవలు, ఆలయాల వద్ద గదుల అద్దె, వ్యాపార సముదాయాల అద్దె, ప్రసాదాల విక్రయం, ఆలయానికి సంబంధించిన బంగారు-వెండి ప్రతిమలు, ఫొటోలు వంటి వస్తువుల విక్రయం ఈ మార్గాల ద్వారా ఆలయాలకు వచ్చే ఆదాయంపైనే జీఎస్టీ విధిస్తున్నారు.
వ్యాట్ అమలులో ఉన్న కాలంలో ఆలయాలకు మినహాయింపు ఉండేది. అయితే 2017లో జీఎస్టీ వచ్చాక, ఆలయాల ఆదాయమంతా పన్ను పరిధిలోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆలయాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని రాష్ట్ర అధికారులు పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం అనేక ఆలయాలకు కోట్ల రూపాయల జీఎస్టీ బకాయిలు పెరిగాయి. వీటిపై అప్పీల్ చేయాలన్నా విధించిన పన్నులో 10 శాతం ఫీజు ముందుగా చెల్లించాల్సి ఉండటంతో దేవాదాయ శాఖ వెనుకడుగు వేస్తోంది.
దేవాదాయ శాఖలో ఒక అధికారి తెలిపినదేమిటంటే
భక్తులు హుండీలో వేసే నగదు, విరాళాలకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంది. ఆర్జిత సేవలు, గదుల అద్దె, వ్యాపార సముదాయాలు, ప్రసాదాలు, కొబ్బరి చిప్పల విక్రయం ఇవన్నీ జీఎస్టీ పరిధిలోకి వస్తున్నాయి. ఆలయ నిర్మాణాలకు, అవసరమైన వస్తువుల కొనుగోలుకే ఇప్పటికే జీఎస్టీ చెల్లిస్తున్నాం. అదే ఆదాయంపై మరోసారి పన్ను వేయడం అన్యాయం. కేంద్రం ఈ విషయంలో పునరాలోచిస్తే భక్తులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది అని తెలిపారు.
ఆలయ సేవలపై పన్ను విధించడం భక్తుల్లో కూడా అసంతృప్తికి దారితీస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని మళ్లీ సమీక్షించాలని వారు కోరుతున్నారు.









.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!