

లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం సచివాలయంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సెప్టెంబరు 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నందున అందరూ సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. పార్టీకి సంబంధించిన వివాదాలపై ప్రజాప్రతినిధులు బహిరంగంగా స్పందించకుండా, తమ నియోజకవర్గాల అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టాలని సీఎం సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని విషయాలను అధిష్ఠానం, క్రమశిక్షణ కమిటీ చూసుకుంటాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
భూసేకరణ, పునరావాసం, అటవీ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రేవంత్‌రెడ్డి సూచించినట్లు తెలిసింది. భూసేకరణకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నందున నియోజకవర్గాల్లో సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇవ్వాలని సమాచార-పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సూచించినట్లు తెలిసింది. ఇదే సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పార్టీ, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా మాట్లాడాలని, సమస్యలు ఉంటే పార్టీ అధ్యక్షుడు లేదా అధిష్ఠానానికి తెలియజేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!