

సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన అంశంపై స్పందించారు. అమెరికా పర్యటనపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని, తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు విద్య, క్రీడలు, పెట్టుబడులపై దృష్టి సారిస్తూ విదేశీ పర్యటనకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించామని, ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి నిరాకరించిందని చెప్పారు.
గుజరాత్ ముఖ్యమంత్రికి ఆగస్టు 17 నుంచి 28 వరకు అమెరికా, కెనడా పర్యటనకు అనుమతి ఇచ్చి.. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా తాను అమెరికాలో పర్యటించేందుకు అనుమతించకపోవడంపై రేవంత్‌రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. ఇది తనకు వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయమని అన్నారు. కేంద్రం వైఖరి తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని ఆరోపించారు. ఈ అంశాన్ని తమ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని తెలిపారు. తన పర్యటనను అడ్డుకోవచ్చేమో కానీ తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ఆధ్వర్యంలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!