

టాటా గ్రూప్‌కు చెందిన దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే ఏజీకి చెందిన ఐటీ అనుబంధ సంస్థ ఎంహెచ్‌పీ మేనేజ్‌మెంట్ ఉండ్ ఐటీ-బెరాటుంగ్ జీఎంబీహెచ్ (ఎంహెచ్‌పీ)లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్‌లో ఎంహెచ్‌పీ ఎంటర్‌ప్రైజ్ విలువ 320 మిలియన్ యూరోలు (సుమారు రూ.3,574 కోట్లు). టీసీఎస్, పోర్షే మధ్య కుదిరిన 1.25 బిలియన్ యూరోల (దాదాపు రూ.14,000 కోట్లు) విలువైన ఐదేళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ కొనుగోలు జరుగుతోంది. యూరోపియన్ కమిషన్‌తో పాటు జర్మనీ, రొమేనియా నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన తర్వాత 3-4 నెలల్లో లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంది.
జర్మనీలోని లుడ్విగ్స్‌బర్గ్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంహెచ్‌పీలో సుమారు 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆటోమోటివ్, తయారీ, ఏరోస్పేస్, రక్షణ, ఇంధన, ప్రభుత్వ రంగాలకు మేనేజ్‌మెంట్, ఐటీ కన్సల్టింగ్ సేవలను అందిస్తున్న ఈ సంస్థ 2025లో 742 మిలియన్ యూరోల (సుమారు రూ.8,300 కోట్లు) టర్నోవర్ నమోదు చేసింది. పోర్షే కోసం టీసీఎస్ ప్రత్యేకంగా ‘ఏఐ మొబిలిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ఏర్పాటు చేయనుంది. తయారీ, ఇంజినీరింగ్, కార్యకలాపాలు, కస్టమర్ అనుభవంలో ఏఐ వినియోగాన్ని పెంచడమే దీని లక్ష్యం. ఆటోమోటివ్ రంగంలో ఏఐ, సాఫ్ట్‌వేర్, డేటా ఆధారిత మార్పులను వేగవంతం చేసేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని టీసీఎస్ ఎండీ, సీఈఓ కె. కృతివాసన్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!