

తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చెన్నై నగర అభివృద్ధి కోసం అధికార డీఎంకే ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సూపర్ సిక్స్’ పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నిన్న చెన్నైలోని అన్నా అరివాలయంలో విడుదల చేశారు.
ఈ మేనిఫెస్టోలో తాగునీటి కనెక్షన్లు లేని ప్రాంతాలకు ఆర్వో నీరు, మెట్రో వాటర్ సరఫరా చేయడం, అలాగే అపార్ట్మెంట్లకు అంతరాయం లేకుండా నీటి సరఫరా కొనసాగించడం వంటి అంశాలు ఉన్నాయి. నగరంలోని ప్రతి వీధిని బస్ స్టాపులు, మెట్రో, సబర్బన్ రైల్వే స్టేషన్లతో అనుసంధానించేందుకు వెయ్యి కొత్త మినీ బస్సులు ప్రవేశపెట్టనున్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించి ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఏఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను అమలు చేయనున్నారు.
అలాగే ఎన్నూరు నుంచి పూంజేరి వరకు చెన్నై సరిహద్దు రహదారి వంటి 10 ప్రధాన ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2028 నాటికి మెట్రో రైల్ విస్తరణ పనులు పూర్తి చేయనున్నారు. 2027 నాటికి భూగర్భ కాల్వలు, మురుగు నీటి వ్యవస్థ, వర్షపు నీటి కాల్వల నిర్మాణాన్ని కూడా పూర్తిచేయాలని ప్రణాళికలో ఉంది. ఇక రూ.10 వేల కోట్లతో ఏఐ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, ఇమ్మర్సివ్ టెక్నాలజీల కోసం గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!