

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టుకు రానున్నారు. ఈ సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానాలు నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకు టీటీడీ అధికారులతో చర్చించి మొత్తం రూ.35.19 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఈ నిధులతో భక్తుల సౌకర్యార్థం కీలక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ ఉదయం 9.25 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, 10.25 గంటలకు కొండగట్టు జేఎన్టీయూ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.30 గంటలకు ఆంజనేయ స్వామివారి దర్శనం అనంతరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ పనుల్లో భక్తుల వసతి కోసం 96 గదుల నిర్మాణం, ఒకేసారి రెండు వేల మంది దీక్ష విరమణ చేసుకునేలా మాల విరమణ మండప నిర్మాణం ఉన్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు బి. ఆనందసాయి, బి. మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్ఏసీ చైర్మన్ ఎన్. శంకర్ గౌడ్ తదితరులు పాల్గొననున్నారు.
కొండగట్టు ఆంజనేయ స్వామి పై పవన్ కళ్యాణ్ కు అపారమైన భక్తి ఉన్నది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం, జనసేన పార్టీ స్థాపన సమయంలో ఆయన కొండగట్టును దర్శించారు. ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ కి కూడా ఇక్కడే తొలి పూజలు చేయించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో మరోసారి కొండగట్టుకు రావడం విశేషంగా భావిస్తున్నారు.
దర్శనం అనంతరం ఉదయం 11.30 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని ఒక రిసార్ట్‌లో జరిగే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అక్కడ తెలంగాణ జనసేన నాయకులతో సమావేశమై చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌లు హెలిప్యాడ్‌తో పాటు ఆలయ పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!