

ఢిల్లీ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్, తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతా దేవికి ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. గత SIR ఓటరు జాబితాతో వారి వివరాలను అనుసంధానం చేయలేకపోవడంతో ‘నో మ్యాపింగ్’ కేటగిరీలో ఈ నోటీసులు ఇచ్చినట్లు న్యూఢిల్లీ నియోజకవర్గ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి తెలిపారు. అయితే వారి పేర్లు ప్రస్తుత డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ పరిణామంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. అయితే ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేయడం పేర్లను తొలగించినట్లు అర్థం కాదని స్పష్టం చేశారు. అవసరమైన పత్రాలు, వివరాలను పరిశీలించిన అనంతరం కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యుల ఓటరు నమోదులను ధ్రువీకరించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా SIRలో భాగంగా నోటీసు జారీ కాగా, ఆమె వివరాలను పరిశీలించిన అనంతరం నమోదు ధ్రువీకరించినట్లు అధికారులు వెల్లడించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి తుది ఓటరు జాబితాను నవంబర్ 4, 2026న విడుదల చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!