

వరంగల్ మామునూరు విమానాశ్రయానికి పేరు సూచించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపుకు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్పందించారు. తన సొంతూరైన వరంగల్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుండటం సంతోషంగా ఉందని పేర్కొంటూ రెండు పేర్లను సూచించారు. ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (RIA)’, ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (KIA)’ పేర్లను ప్రతిపాదించారు. వరంగల్ ఘనమైన చరిత్ర, వారసత్వం, సాంస్కృతిక స్ఫూర్తిని ప్రతిబింబించే పేరు విమానాశ్రయానికి పెట్టడం అర్థవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
‘దసరా’, ‘ది ప్యారడైజ్’ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్ కేవలం మ్యాప్‌లోని ప్రాంతం కాదని, లక్షలాది మంది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన నగరమని పేర్కొంటూ ‘సమ్మక్క-సారక్క ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ పేరును సూచించారు. మరోవైపు నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విమానాశ్రయం ఏర్పాటును స్వాగతించింది. దీని వల్ల ప్రాంతీయ అభివృద్ధితో పాటు వరంగల్ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపింది. నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ‘రాణి రుద్రమ దేవి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, వరంగల్’ పేరును ప్రతిపాదించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!