

బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సెప్టెంబర్ 8న ఏర్పడిన భారీ అంతరాయానికి చిన్న సాఫ్ట్‌వేర్ లోపమే కారణమని బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS) ప్రాథమిక విచారణలో తేలింది. యూకే గగనతల నిర్వహణకు కీలకమైన నేషనల్ ఎయిర్‌స్పేస్ సిస్టమ్ (NAS)లోని ఓ చిన్న కోడ్ భాగంలో ఈ లోపం ఏర్పడింది. విమానాలకు గుర్తింపు కోడ్‌లు కేటాయించే సమయంలో మిల్లీసెకన్ వ్యవధిలో జరిగిన ప్రాసెసింగ్ లోపం కారణంగా డేటా సరిగా అప్‌డేట్ కాలేదని NATS వెల్లడించింది. ఈ ఘటనకు సైబర్ దాడి లేదా సైనిక జోక్యంతో సంబంధం లేదని స్పష్టం చేసింది.
ఫ్లైట్ డేటాలో కొంత సమాచారం అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమాన రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. సమస్య ప్రధానంగా లండన్ ఏరియా కంట్రోల్ సెంటర్ పరిధిలోని విమానాలపై ప్రభావం చూపినప్పటికీ, వ్యవస్థను పునఃప్రారంభించి ఫ్లైట్ డేటాను తిరిగి లోడ్ చేసేందుకు దేశవ్యాప్తంగా పరిమితులు అమలు చేశారు. సుమారు ఆరు గంటల తర్వాత కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే ప్రయాణికులపై ఏర్పడిన ప్రభావాన్ని పూర్తిగా తొలగించేందుకు రెండు రోజులకు పైగా సమయం పట్టింది. లోపాన్ని గుర్తించి తాత్కాలిక పరిష్కార చర్యలు చేపట్టామని, శాశ్వత పరిష్కారాన్ని భద్రతా పరీక్షల అనంతరం అమలు చేస్తున్నామని NATS తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!