

భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఈ అంశంపై పార్లమెంటులోనూ విస్తృత చర్చలు జరిగాయి. పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని కేంద్రం వాదిస్తుండగా, ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నరవణె స్పందిస్తూ, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా విడుదల చేసిన ప్రకటనను ఎక్స్ వేదికగా రీపోస్ట్ చేశారు. పుస్తకం ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ దశలో మాత్రమే ఉందని, ఇంకా అధికారికంగా ప్రచురితం కాలేదని స్పష్టం చేశారు.
అయితే రాహుల్ గాంధీ మాత్రం నరవణె గతంలో చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ, పుస్తకం అందుబాటులో ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా మరోసారి స్పష్టత ఇచ్చింది. అధికారికంగా విడుదలై, రిటైల్ వేదికల్లో విక్రయానికి ఉంచిన పుస్తకాలనే ప్రచురితమైనవిగా పరిగణిస్తామని పేర్కొంది. ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ ఇంకా ప్రచురితం కాలేదని, మార్కెట్లో అందుబాటులో లేదని మరోసారి స్పష్టం చేసింది. ఈ అంశంపై 24 గంటల్లో రెండుసార్లు ప్రకటన విడుదల చేయడం గమనార్హంగా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!