

అమరావతి, ఫిబ్రవరి 12: 2026–27 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులు, ప్రాజెక్టుల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్రం మంజూరు చేసిన రేర్ ఎర్త్ కారిడార్ సహా కీలక ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని అదనపు నిధులు సాధించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. గత పాలనలో కేంద్ర పథకాల నిధులు సరిగా వినియోగించకపోవడంతో యుటిలిటీ సర్టిఫికెట్ల సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. అన్ని శాఖలు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తే, వచ్చే బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
రేర్ ఎర్త్ కారిడార్‌ను శ్రీకాకుళం–విజయనగరం–విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను మూలపేట నుంచి కృష్ణపట్నం వరకు విస్తరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కంటైనర్, ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్, మెగా టెక్స్టైల్ పార్క్ (పలనాడు), స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ (తిరుపతి), సెమీకండక్టర్ డిజైన్ ప్రాజెక్టులు (అమరావతి) వంటి పరిశ్రమలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే హెల్త్ సిటీ, బయో డిజైన్, మెడ్‌టెక్ పార్క్, మెడికల్ టూరిజం ‘హీల్ ఇన్ ఏపీ’ విధానంతో అభివృద్ధి చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులు, ఫుడ్ ప్రాసెసింగ్, కొబ్బరి, కాఫీ, కాజు వంటి వ్యవసాయ ఆధారిత రంగాలకు మరిన్ని నిధులు సాధించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!