

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. సీఎం పర్యటన రాజకీయ ప్రచారానికి పరిమితం కాకుండా జిల్లా అభివృద్ధికి ఉపయోగపడేలా కీలక నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాల్లో సుమారు 397 గ్రామాలకు సాగునీరు అందించే సామర్థ్యం ఉన్న సంగమేశ్వర–బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులు పూర్తయితే వర్షాధార వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులకు శాశ్వత సాగునీటి భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.
అలాగే సంగారెడ్డి, సదాశివపేట వేజ్ అండ్ నాన్-వేజ్ మార్కెట్ యార్డుల పనులు, SDF, TUFIDC నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మినీ హజ్ హౌస్, ఆత్మకూర్–సింగూర్ రోడ్డు, MRR రోడ్ల పనులను పూర్తి చేయాలని కోరారు. పూర్తయిన సంగారెడ్డి, సదాశివపేట మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలను వెంటనే ప్రారంభించాలని, ఇస్నాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో రైలు పొడిగింపునకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహబూబ్ సాగర్ చెరువును జలవిహార్ తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు ఆలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, సంగారెడ్డి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ (YIIRSC) ఏర్పాటు చేయాలని కోరారు. గత హామీలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా జీవోలు జారీ చేసి, నిధులు విడుదల చేసి, పనులను ప్రారంభించినప్పుడే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని చింత ప్రభాకర్ స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!