

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను, మంత్రులను సమాయత్తం చేశారు. తాజాగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కనీసం 90 శాతం స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
మంత్రులంతా రేపటి నుంచి తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లి ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సీఎం ఆదేశించారు.
పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను స్వయంగా కలిసి బుజ్జగించాలని, వారందరినీ ప్రచార బరిలోకి దించాలని సూచించారు. మాట వినని రెబల్ అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు.
తాను నిర్వహించిన మూడు రకాల సర్వేల్లో కాంగ్రెస్ వెనకబడిన ప్రాంతాలను సీఎం గుర్తించారు. ఆయా మున్సిపాలిటీల జాబితాను మంత్రులకు అందజేసి, అక్కడ గెలుపు కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ఇన్ చార్జ్ మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీల పరిస్థితులపై ప్రతిరోజూ నివేదికలు సమర్పించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!