

సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై స్పందిస్తూ ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు చేస్తూ బాధిత కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో జరిగిన ఈ ప్రమాదం ఎంతో బాధను కలిగించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని, ఈ కష్ట సమయంలో కుటుంబాలకు ధైర్యం, ఓదార్పు లభించాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మదీనా ప్రాంతంలో జరిగిన ఈ భయంకర ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ నెల 9 వ తేదీన భారత్ నుంచి మొత్తం 54 మంది మక్కా యాత్ర కోసం బయలుదేరారు. ప్రార్థనలు ముగించుకుని 46 మంది సోమవారం బస్సులో మదీనా ప్రయాణమయ్యారు. బదర్–మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో బస్సు–ట్యాంకర్ ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగిపోయి పరిస్థితి విషాదకరంగా మారింది. అనేక మంది యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!