

హైదరాబాద్‌లో నిబంధనల ప్రకారం ఓటరు జాబితా సవరణకు సంబంధించిన ఫారాలను పంపిణీ చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాతబస్తీలో ఎంఐఎం పార్టీ ఇన్నాళ్లూ బోగస్ ఓట్ల ఆధారంగా గెలుస్తూ వచ్చిందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆ పార్టీతో కుమ్మక్కై రాజకీయ ప్రయోజనాలు పొందాయని విమర్శించారు. ప్రస్తుతం ఓటరు జాబితా ప్రక్షాళన జరుగుతుండటంతో తమ రాజకీయ పునాదులు కదిలిపోతాయనే భయంతో ఆ పార్టీలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు.
బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఓట్లను సరిచూసేందుకు ఫారాలను పంపిణీ చేసే హక్కు భాజపాకు ఉందని రామచందర్‌రావు తెలిపారు. చట్టబద్ధమైన ప్రక్రియను అడ్డుకుని పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ‘సర్’ ప్రక్రియపై ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు తదితరుల అక్రమ ఓట్లను మాత్రమే తొలగిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు చేస్తున్న విష ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతో రాజ్యాంగ సంస్థలపై కుట్రలకు పాల్పడుతోందని కూడా ఆరోపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!