

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై ప్రధానంగా చర్చించారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. తాగునీటి అవసరాల కోసం 50:50 నిష్పత్తిలో నీటిని వినియోగించాలని తెలంగాణ ప్రతిపాదించినట్లు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు తెలిపారు. అలాగే ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీటిని వినియోగించుకుందని తెలంగాణ తరఫున ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహ మూర్తి మాట్లాడుతూ తాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీల నీటిని కోరామని, దీనికి సూత్రప్రాయంగా అంగీకారం లభించిందని తెలిపారు. అయితే తెలంగాణ ఏడాది మొత్తం నీటి వినియోగంపై ప్రతిపాదన చేసిందని, ఏపీ మాత్రం అక్టోబర్ వరకు నీటి వినియోగానికి అనుమతించాలని కోరిందని వివరించారు.
రెండు రాష్ట్రాల మధ్య మొత్తం నీటి వాటాల అంశం ఈ సమావేశంలో చర్చకు రాలేదు. సెప్టెంబర్ 4న మరోసారి సమావేశమై తాగునీటి అవసరాలపై చర్చించాలని నిర్ణయించారు. భవిష్యత్‌లో కృష్ణా నదికి అదనపు ప్రవాహాలు వస్తే, ఆ సమయంలో నీటి వినియోగంపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!