

2021 లో అమెరికా క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి సందర్భంలో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుగా చూపించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీబీసీ (BBC) ఇప్పుడు మరింత పెద్ద చిక్కుల్లో పడింది. తాజాగా ట్రంప్ ఆ సంస్థ పై పరువు నష్టం దావా వేశారు.
తన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా సవరించి ప్రజలను తప్పుదారి పట్టించిందని ఆరోపిస్తూ, 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ.90 వేల కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మియామిలోని ఫెడరల్ కోర్టులో 46 పేజీల పిటిషన్ దాఖలు చేశారు.
శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన తన ప్రసంగాన్ని రెండు చోట్ల మార్చి ఉద్రిక్తతకు దారితీసేలా ప్రసారం చేశారని ట్రంప్ ఆరోపించారు. దీనివల్ల తన పరువుకు తీవ్ర నష్టం జరిగిందని, అలాగే ఫ్లోరిడా రాష్ట్ర చట్టాలను ఉల్లంఘిస్తూ బీబీసీ అన్యాయమైన వ్యాపార విధానాలు పాటించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ రెండు ఆరోపణలకుగాను ఒక్కొక్కదానికి 5 బిలియన్ డాలర్ల చొప్పున నష్టపరిహారం కోరారు.
2021 జనవరి 6 న వాషింగ్టన్లో క్యాపిటల్ హిల్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడులు చేసిన రోజున, ట్రంప్ సుమారు గంటపాటు ప్రసంగించారు. అయితే బీబీసీ తన పనోరమ డాక్యుమెంటరీలో ఆ ప్రసంగాన్ని వక్రీకరించి, “క్యాపిటల్ హిల్‌కు వెళ్తున్నాం… మనం ఘోరంగా పోరాడుదాం” అని పిలుపునిచ్చినట్టుగా చూపించిందని ట్రంప్ వాదించారు.
ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపడంతో, అప్పట్లో బీబీసీ డైరెక్టర్ జనరల్ టీమ్ డేవీ, న్యూస్ చీఫ్ డెబోరా టర్నెస్ తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!