

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు కనీసం ఒక అప్లికేషన్ కూడా నింపలేరని వ్యాఖ్యానించడం బాధాకరమని ఆయన అన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన అర్వింద్, ఇతరుల సహాయం లేకుండా ఎన్నికల నామినేషన్ కూడా నింపలేని వ్యక్తి విద్యార్థులను కించపరిచేలా మాట్లాడడం సరికాదని విమర్శించారు.
రాష్ట్ర విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బ్లాక్‌బోర్డులు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారా అని అర్వింద్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న విద్యాసంస్థల్లోనే సదుపాయాలు కల్పించలేకపోతూ కొత్త పాఠశాలల నిర్మాణంపై మాట్లాడడం ఆశ్చర్యకరమన్నారు. గతంలో విద్యార్థులపై ఇలాంటి వ్యాఖ్యల కారణంగానే బీఆర్ఎస్ నాయకత్వం ప్రజల ఆగ్రహానికి గురైందని, కాంగ్రెస్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!