

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి తన ప్రత్యేకమైన ఆంగ్ల పదజాలంతో సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఎక్స్ వేదికగా ‘క్వాకర్వోడ్జర్’ (Quockerwodger) అనే అరుదైన పదాన్ని రాజకీయ వ్యాఖ్యలో ఉపయోగించారు. ఇతరుల నియంత్రణలో ఉండే రాజకీయ నాయకుడు, వారి ఆదేశాల మేరకు పనిచేసే రాజకీయ కీలుబొమ్మను ‘క్వాకర్వోడ్జర్’ అంటారని థరూర్ వివరించారు. దీనిని ‘మన కాలానికి సరైన పదం’గా పేర్కొంటూ, గత 12 ఏళ్లలో అధికార పార్టీ ఇలాంటి కొందరిని తయారు చేసిందని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే థరూర్ ఈ పదాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. 2022 ఏప్రిల్లోనూ ఆయన ‘క్వాకర్వోడ్జర్’ పదాన్ని ప్రస్తావించారు.
శశి థరూర్ గతంలోనూ రాజకీయ, సామాజిక అంశాలపై వ్యాఖ్యానించేటప్పుడు అరుదైన ఆంగ్ల పదాలను ఉపయోగించారు. ‘అలోడాక్సాఫోబియా’ (Allodoxaphobia) వంటి పదాలను కూడా ఆయన గతంలో ప్రస్తావించి వాటి అర్థాలను వివరించారు. థరూర్ ఇలాంటి క్లిష్టమైన పదాలను ఉపయోగించిన ప్రతిసారీ సోషల్ మీడియా వినియోగదారులు వాటి అర్థాలను తెలుసుకునేందుకు నిఘంటువులను ఆశ్రయిస్తుంటారు. తాజాగా ‘క్వాకర్వోడ్జర్’ పదం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించడంతో, థరూర్ రాజకీయ వ్యాఖ్యానంలో ఉపయోగించిన ఈ పదంపై చర్చ కొనసాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!