

మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రాజ్యాంగ నిపుణుడు, రచయిత ఏజీ నూరానీని స్మరించుకునేందుకు న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో అన్సారీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసినట్లు పేర్కొంటున్న ఓ వ్యాఖ్యను ఆయన ప్రస్తావించారు. భారత్‌కు ముప్పు కమ్యూనిజం వల్ల కాదని, హిందూ మితవాద మతతత్వం వల్లేనని నెహ్రూ అభిప్రాయపడినట్లు అన్సారీ తెలిపారు. నూరానీ 2019లో రచించిన ‘ది ఆర్‌ఎస్‌ఎస్: ఏ మెనేస్ టు ఇండియా’ పుస్తకాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
అదే సమయంలో దేశంలో పౌర జాతీయవాదం నుంచి సాంస్కృతిక జాతీయవాదం వైపు మార్పు చోటుచేసుకుంటోందని అన్సారీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం సమాన పౌరసత్వ సూత్రానికి సవాల్‌గా మారే అవకాశం ఉందని పేర్కొంటూ, ఇలాంటి ధోరణులను చట్టపరంగా, రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్సారీ వ్యాఖ్యలపై భాజపా నేతలు స్పందించారు. భాజపా ఎస్టీ మోర్చా ఆయన వ్యాఖ్యలను విమర్శిస్తూ, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. దీంతో లౌకికవాదం, జాతీయవాదం, భారత రాజకీయాల్లో మతపరమైన గుర్తింపు పాత్రపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!