

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన Sundays On Cycle 57 వ హైదరాబాద్ ఎడిషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం, జీవనశైలి మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశ ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఫిట్ ఇండియా కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. నేటి జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, వాతావరణ మార్పులు వంటి కారణాల వల్ల అనారోగ్యం, ముఖ్యంగా ఒబెసిటీ పెరుగుతోందని అన్నారు.
ఒబెసిటీని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు.
మానసిక ఒత్తిడి కూడా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. చిన్నప్పట్లో మన పనులను మనమే చేసుకునే అలవాటు ఉండేదని, కానీ నేటి ఆధునిక టెక్నాలజీ కారణంగా శారీరక శ్రమ తగ్గడం అనారోగ్య సమస్యలను పెంచుతోందని వ్యాఖ్యానించారు.
ఆరోగ్య భారత్ నిర్మాణానికి ఫిట్ ఇండియా కీలకమని, శక్తివంతమైన యువత ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశానికి సేవ చేయగలరని ఆయన స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన యువత మేధస్సే దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!