

మజ్లిస్ పార్టీ కారణంగా మన దేశం ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. ఈ పరిస్థితి కేవలం హైదరాబాద్‌కే లేదా తెలంగాణకే పరిమితం కాదని, కాంగ్రెస్ పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలువురు వైద్యులు, పారామెడికల్ నిపుణులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఆ మార్పును తీసుకురావాల్సిన బాధ్యత మేధావులపైనే ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ విధానాలను ప్రజలకు స్పష్టంగా వివరించలేక, బూతుల రాజకీయాలతో కాలం గడుపుతున్నాయని విమర్శించారు. జాతీయ అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘సర్’ వంటి జాతీయ అంశాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని అన్నారు.
ఇదే కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జీహెచ్ఎంసీ పరిధిలో డివిజన్లను విభజించడం సరికాదని అన్నారు. పన్నులు చెల్లించే వారిని, చెల్లించని వారితో కలపవద్దని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఆదిభట్ల, తుక్కుగూడ, రాజేంద్రనగర్, శంషాబాద్, బండ్లగూడ మునిసిపాలిటీలను చార్మినార్ జోన్లో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తాము పన్నులు చెల్లిస్తుంటే, ఆ డబ్బును పాతబస్తీలో ఖర్చు చేయడం ఎలా సమంజసమని ఆయన ప్రశ్నించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!