

జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సహా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్యకు బీఆర్ ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాసారు.
క్యాబినెట్‌ను ఢిల్లీకి పిలిపించుకుని మీరు చేయబోయే 'సమీక్ష'ను చూస్తుంటే.. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటోంది. స్వయం పాలన కోసం, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం.. ఇవాళ మీ ఢిల్లీ దర్బార్‌లో మోకరిల్లడం ఈ నేల ఆత్మగౌరవాన్ని భంగపరుస్తున్నది. తెలంగాణ ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నది ఒక స్వతంత్ర ప్రభుత్వాన్నా? లేక మీ ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన్నా? అని ప్రజలు వాపోతున్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తున్న మీకు, ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి ఇచ్చిన మీ హామీలను గుర్తు చేస్తున్నాను. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పటికే రెండేన్నరేండ్లు గడిచింది. మిగిలిన కొద్ది కాలంలో అయినా మీరు ఇచ్చిన హామీలకు కట్టుబడి త్వరగా నెరవేర్చాలని, ఆ దిశగా మీ ముఖ్యమంత్రికి హితబోధ చేయాలని కోరుతున్నాను. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని మీరు హామి ఇచ్చారు. తీరా చూస్తే బిల్లు ‘నిల్లయింది’, ప్రజల విశ్వాసం 'కిల్లయింది'. ఈ ప్రజా విద్రోహానికి క్షమాపణలు చెబుతూ మీ సమీక్ష ప్రారంభించండి.
సోనియా గాంధీ .. ఆరు గ్యారెంటీల అమలుకు మీరు స్వయంగా హామీ పడుతూ బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టి ప్రజల ఓట్లు పొందారు. మీ ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఆ బాండులకు విలువ లేకుండా పోయింది. అవి నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాకుండా పోయాయి. రాహుల్ గాంధీ గారూ.. వరంగల్ రైతు డిక్లరేషన్ లో మీరు ఇచ్చిన హామీలను మీరే విస్మరించారు. వాటిని మీకు మళ్లీ గుర్తు చేస్తున్నాను. రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, కౌలు రైతులకు కూడా రైతు భరోసా లబ్ది చేకూర్చుతామని, ఉపాధి హామి కూలీలకు ఏడాదికి 12వేలు ఇస్తామని, అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లిస్తామని, పంట బీమా కల్పిస్తామని నమ్మబలికారు. ఇప్పుడు ఈ హామీలన్నీ నీటి మూటలు అయ్యాయి. రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టారు, రెండు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టారు, పంట బోనస్ ఒక పంటకే పరిమితం చేసారు, పంట బీమా అటకెక్కించారు. నమ్మిన రైతులను నట్టేట ముంచిన మీ ప్రభుత్వ నయవంచనపై సమీక్ష చేస్తారా? అని లేఖలో హరీష్ రావు ప్రశ్నించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!