

తెలంగాణలో వైద్య రంగాన్ని మరింత బలపరచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో అందిస్తున్న వైద్య సేవల్లో కనీసం 50 శాతం తెలంగాణ నుంచే అందేలా ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇందుకు అవసరమైన విధాన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేసిన అపోలో హాస్పిటల్స్ కొత్త కేంద్రాన్ని మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డితో పాటు యాజమాన్యాన్ని అభినందించారు.
మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించినట్లు సీఎం తెలిపారు. విదేశీ రోగులు సులభంగా తెలంగాణకు చేరుకునేందుకు పశ్చిమాసియా దేశాలతో నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. వైద్య రంగంలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని, అభివృద్ధికి అవసరమైన అన్ని మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. గతంలో తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల హైదరాబాద్ ఫార్మా రంగంలో కీలక కేంద్రంగా ఎదిగిందని, దేశం నుంచి ఎగుమతి అవుతున్న బల్క్ డ్రగ్స్‌లో సుమారు 40 శాతం ఇక్కడ నుంచే వస్తున్నాయని గుర్తుచేశారు.
చెన్నైలో చిన్న స్థాయిలో ప్రారంభమైన అపోలో సంస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించి, 76 వ బ్రాంచ్‌ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. 2028 నాటికి 100 వ కేంద్రాన్ని ప్రారంభించాలన్న లక్ష్యాన్ని కూడా స్వాగతించారు. అపోలో ఆసుపత్రులు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బ్రాండ్‌గా ఎదిగిందని సీఎం ప్రశంసించారు. మహిళా సాధికారతలో కూడా సంస్థ చూపిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంగీతా రెడ్డి, శోభనా కామినేని, ఉపాసన కొణిదెలతో పాటు ఇతర ప్రముఖులు, వైద్యులు పాల్గొన్నారు.







.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!