

భక్తి, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కిన 'హనుమాన్ అంశ్' చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నీమ్ కరోలి బాబా జీవిత విశేషాల ఆధారంగా దర్శకుడు విశాల్ చతుర్వేది రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. నవంబర్ 27 నుంచి హిందీ వెర్షన్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుండగా, నవంబర్ 29 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా సినిమాలో నీమ్ కరోలి బాబా పాత్ర పోషించిన శోభినవ్ సత్య తన నటనా ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తొలుత ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడానికి వచ్చానని, అయితే ప్రధాన నటుడు అనారోగ్యానికి గురవడంతో అనూహ్యంగా హీరోగా మారాల్సి వచ్చిందని తెలిపారు. సినిమా ఆగిపోకూడదనే ఉద్దేశంతో బాబా పాత్రను అంగీకరించానని, దానిని హనుమంతుడి ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పారు.
ఈ సినిమాలోని పాటను ప్రధాని నరేంద్ర మోదీ కారులో వింటున్న వీడియో వైరల్ కావడంపై కూడా శోభినవ్ స్పందించారు. ఢిల్లీలో ట్రాఫిక్ కారణంగా కార్యక్రమానికి సమయానికి చేరుకోలేకపోయానని, కారులోనే మొబైల్ ద్వారా లైవ్ చూశానని వెల్లడించారు. మోదీ స్పందన తనకు ఎంతో గర్వంగా అనిపించిందన్నారు. నిర్మాతల మధ్య విభేదాలున్నాయనే ప్రచారాన్ని ఖండిస్తూ, చిత్రబృందమంతా కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక సినిమా సీక్వెల్ పనులు ఇంకా ప్రారంభం కాలేదని, త్వరలో దర్శకుడు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భక్తిరస చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!