

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ నెలాఖరులో, వచ్చే నెల రెండో వారంలో రాష్ట్రానికి వరుసగా రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉందని అంచనా వేసింది. తాజా వాతావరణ సూచనల ప్రకారం నవంబర్ 28 లేదా 29 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 30 నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ డిసెంబర్ 2 లేదా 3 నాటికి వాయుగుండంగా లేదా తుఫానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక, దక్షిణ తమిళనాడు వైపు కదిలే అవకాశముందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు తీరాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తూర్పు గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. మార్కాపురం జిల్లా పామూరులో అత్యధికంగా 74.87 మి.మీ., నెల్లూరు జిల్లా అల్లంపాడులో 55.5 మి.మీ., గూడూరులో 51.25 మి.మీ., తిరుపతి జిల్లా నాయుడుపేటలో 43.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. డిసెంబర్ 1 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం రాయలసీమలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. తెలంగాణలో రానున్న రోజుల్లో ఎక్కువగా పొడి వాతావరణం కొనసాగనున్నప్పటికీ, అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో చలి తీవ్రత కూడా పెరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!