

జేసన్ స్టాథమ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ మ్యూటిని అనూహ్య కారణాలతో వార్తల్లో నిలిచింది. ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో పొరపాటున కొన్ని గంటల ముందే స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచారు. దీంతో సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీలో కనిపించడంతో మూవీ లవర్స్ ఆశ్చర్యపోయారు.
అమెరికాలో మాత్రమే ఈ పొరపాటు జరిగినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్‌లో సినిమా అందుబాటులోకి వచ్చిన విషయాన్ని గుర్తించిన వెంటనే ప్లాట్‌ఫామ్ దాన్ని తొలగించింది. అయితే అప్పటికే పలువురు ప్రేక్షకులు సినిమాను యాక్సెస్ చేయడంతో పాటు పూర్తిగా చూసినట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో మాత్రం ఈ పొరపాటు స్ట్రీమింగ్ జరగలేదని సమాచారం.
మ్యూటిని సినిమాలో జేసన్ స్టాథమ్ మాజీ ఆర్మీ అధికారిగా కనిపిస్తారు. తన కళ్ల ముందే యజమాని హత్యకు గురైన తర్వాత అందుకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతడు నిర్ణయించుకుంటాడు. హంతకులు సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గో షిప్‌లో ఉన్నారని తెలుసుకున్న తర్వాత వారి వెంట వెళ్లే క్రమంలో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది.
కార్గో షిప్‌లోకి వెళ్లిన తర్వాత హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? నేరస్థుల నుంచి తప్పించుకున్నాడా? తన యజమాని హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాడా? అనే అంశాల చుట్టూ మ్యూటిని కథ సాగుతుంది. యాక్షన్, అడ్వెంచర్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమాను రూపొందించారు.
థియేటర్లలో విడుదలకు కొన్ని గంటల ముందే ఓటీటీలో సినిమా అందుబాటులోకి రావడం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రీమియర్ కాదు. అమెజాన్ ప్రైమ్‌లో జరిగిన సాంకేతిక లేదా అప్లోడ్ పొరపాటు కారణంగానే సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇలాంటి ఘటన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కొత్తేమీ కాదు. 2019లో తమిళ చిత్రం ఆర్కే నగర్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో పొరపాటున ముందుగానే స్ట్రీమింగ్‌కు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. విషయం గుర్తించిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఆ సినిమాను తొలగించింది. ఇప్పుడు మ్యూటిని విషయంలోనూ ఇదే తరహా పరిణామం చోటుచేసుకోవడం మరోసారి చర్చనీయాంశమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!