

ఓట్ల తొలగింపు, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అవకతవకలను ప్రశ్నిస్తూ నిరసన చేపట్టిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ఇండియా కూటమి ఎంపీలను అదుపులోకి తీసుకోవడాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్షం లేవనెత్తుతున్న అంశాలకు సమాధానం చెప్పాల్సిన కేంద్రం నిరసనలను అణచివేయడం సరికాదని ఆరోపించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ, ఇతర ఇండియా కూటమి నేతల నిర్బంధాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ముందు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని అన్నారు. ఇండియా కూటమి నేతలు లేవనెత్తుతున్న అంశాలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, నిర్బంధాలపై ప్రజాస్వామ్యవాదులు ఖండన వ్యక్తం చేయాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!