

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో చేపట్టిన భూ సర్వే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 388 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, క్షేత్రస్థాయి సర్వేలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో లెక్కకు రాని 45 ఎకరాల భూమి ఎక్కడుందో తేల్చాలని సీఎం ఆదేశించారు.
భూమిని గుర్తించేందుకు ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. సర్వే నంబర్ 325 సరిహద్దుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భూములు ఉన్న నేపథ్యంలో, సంబంధిత రెవెన్యూ రికార్డులు, పత్రాలను సమర్పించాలని వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సర్వేలో గుర్తించే ప్రభుత్వ భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అదే భూమిలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగించి, జూన్ 2లోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!